కొత్త ట్రాఫిక్ నిబంధనలు వాహనచోదకులకు భయం కలిగిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే వేలకు వేలు జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం మధ్యాహ్నం ఒంటి గంటలోగా 30లక్షల రూపాయల జరిమానా వసూలు చేశామని నగర పోలీస్‌కమిషనర్ భాస్కర్‌రావు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్లో లక్షలాదిమంది మృత్యువాతపడుతున్నందున సరికొత్తచట్టాన్ని అమలులోకి తెచ్చారన్నారు.
బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అమలులోకి తెచ్చిన కొత్త ట్రాఫిక్ చట్టానికి అనుగుణంగా ప్రజలు వ్యవహరించాల్సిందేనని నగర పోలీస్ కమిషనర్ భాస్కర్‌రావు వెల్లడించారు. గురువారం నగర కమిషనరేట్‌లో అదనపు పోలీస్ కమిషనర్ రవికాంతేగౌడ, డిసిపి డాక్టర్ సౌమ్యలతలతో కలిసి ఆయన పలు అంశాలను మీడియాకు వివరించారు. దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని గడచిన దశాబ్ద కాలంలో లక్షలాది మంది అర్థాంతరంగా మృత్యువాత పడుతున్నందున సరికొత్తచట్టాన్ని అమలులోకి తెచ్చారన్నారు.
ప్రధానంగా మద్యపానం సేవించడం ద్వారా ప్రమాదాలు తీవ్రం అవుతున్నాయన్నారు. ర్యాష్ డ్రైవింగ్, వన్‌వేలో ప్రయాణించడం వంటి వాటిపై సమగ్రంగా పరిశీనలు ఇకపై కొనసాగుతాయని నగర కమిషనర్ భాస్కర్ రావు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించిన విషయంలో అనవసరంగా వాగ్వాదానికి దిగితే 353 సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. బాడీఫోన్ కెమరాలను 600 మంది ట్రాఫిక్ పోలీసులకు కేటాయిస్తున్నామన్నారు. ట్రాఫిక్‌లో 10 సెకెన్లు ఇబ్బంది కల్గించినా అడ్డదిడ్డంగా వ్యవహరిస్తే 150 వాహనాలపై బెంగళూరులో ప్రభావం చూపుతుందన్నారు. అన్ని విద్యాసంస్థల్లోనూ అవగాహనా సదస్సును ఏర్పాటు చేయదలచామని ఈ మేరకు బీబీఎంపీకి లేఖలు పంపుతున్నామని పార్కింగ్ స్థలాలు సక్రమంగా పర్యవేక్షించాలని సూచిస్తామన్నారు.
నగరంలో కొత్త ట్రాఫిక్ చట్టం ఈ నెల 3న అమలులోకి వచ్చిందని బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం మధ్యాహ్నం 1 గంట లోగా 30 లక్షల రూపాయలు జరిమానా విధించామన్నారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన మేరకు 1518 కేసులు నమోదు చేసి రూ.15.18 లక్షలు, పిలియన్ రైడర్‌కు హెల్మెట్ లేకపోవడంపై 1121 కేసులు నమోదు చేసి 11.21 లక్షలు వసూలు చేశామన్నారు. మద్యం సేవించి వాహనం నడిపిన మేరకు 10 వేల రూపాయల జరిమానా ఉంటుందన్నారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ఇతరులకు సహకారం అందించిన వారవుతారన్నారు.
