లక్నో: అసోం ఎన్‌ఆర్‌సి తరహాలో పౌరుల జాబితాను అమలు చేయాలని భావిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యానాథ్ దాస్ ప్రకటించారు. దేశ రక్షణ దృష్ట్యా యూపిలో కూడా పౌరుల జాబితాను రూపొందించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చిస్తానని చెప్పారు.ఇటీవల అసోంలో చేపట్టిన ఎన్‌ఆర్‌సి నివేదికతో ఓ వైపు ఆరాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలోనే మరోవైపు ఇతర రాష్ట్రాల్లో కూడా పౌరుల జాబితాను రూపొందించాలని దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపి సైతం యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఈ సందర్భంగా అసోంలో పౌరుల జాబితాను రూపొందించడం చాలా సాహసోపేతమైన నిర్ణయమని ప్రకటించిన ఆయన రాష్ట్రంలో కూడా అవసరమైతే చేపడతామని అన్నారు. దీనికి సంబంధించి అసోంలో లెక్కింపు జరిగిన విధానంపై సమీక్ష జరుపుతామని తెలిపారు. దీంతో ఎలాంటి పొరపాట్లు లేకుండా జరిపేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. మరోవైపు హర్యాన సిఎం మనోహర్ లాల్ ఖత్తర్ కూడా జాబితాపై సానుకూలంగా స్పందిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోకి అక్రమ వలసలు తనిఖీ చేయడానికి జాబితా అవసరం అవుతుందని ఆయన చెప్పారు. ఈనేపథ్యంలోనే హర్యానాలో అస్సాం తరహాలో ఎన్‌ఆర్‌సిని అమలు చేస్తామని ప్రకటించారు.
