దాదాపు 60 ఏళ్ల వయసున్న చిగుర్ల ఐతయ్య చెంచు తెగ పెద్దమనిషి. నల్లమల అడవుల్లోని కుడిచింత బయలు గ్రామంలో, ఆర్డీఎఫ్ ట్రస్టు వారు తనకు కట్టిచ్చిన చిన్న ఇంటి ముందు నులక మంచం మీద కూర్చుని వచ్చేపోయే బండ్లను చూస్తున్నారు. ఎదురుగా ఉన్న కంకర రోడ్డు మీద దుమ్ము రేపుకొంటూ పెద్ద పెద్ద కార్లు మల్లెలతీర్థం వైపు వెళుతున్నాయి. శ్రీశైలం-హైదరాబాద్ దారిలో ఉన్న పర్యాటక కేంద్రాల్లో మల్లెల తీర్థం ఒకటి. బీబీసీ బృందం పలకరించినప్పుడు ఆ పెద్దమనిషిలో దిగులు కనిపించింది. కొంత కాలం తరువాత ఆ ఊరు, ఆ మల్లెలతీర్థం, తమ అడవి, తమ వ్యవసాయం, పర్యటకుల సందడి.. ఇవన్నీ ఉంటాయో ఉండవో అన్న బెంగ ఆయనలో ఉంది. కారణం- తమ అడవిలో యురేనియం తవ్వుతారన్న వార్తలే.
“ఇంత ఆరోగ్యకరమైన స్థలం నుంచి వెళ్లగొడితే ఎక్కడికి పోతాం? మేమెక్కడికీ పోం. (యురేనియంను) తవ్వనీయం. తవ్వనీయం. తవ్వనిస్తే మేం భంగపడిపోతాం. యురేనియం తవ్వితే ఊళ్లు నాశనమైపోతాయి. అందుకే తవ్వద్దు. తవ్వితే దాని విష పదార్థం కొట్టి భంగం అయిపోతాం” అన్నారు ఐతయ్య.
“మేం మొదట్లో వాళ్లు తవ్వుకుని పోతారులే అనుకున్నాం. కానీ అది తవ్వితే విషం గాల్లో వచ్చి మనకు పారుతుంది అని చెప్పారు. మనుషులు బతకరు అన్నారు. అట్లైతే అసలే వద్దు. మనం చావనీకి అదెందుకు తవ్వాలి?” అని ప్రశ్నించారాయన.
కుడిచింత బయలు గ్రామం కానీ, మల్లెల తీర్థం కానీ ప్రస్తుతం ప్రతిపాదించిన యురేనియం సర్వే బోర్లు వేసే ప్రాంతంలో లేవు. అయినా వారిలో అంత బెంగ ఉండటానికి కారణం, పక్క ఊరు తవ్వినప్పుడు తమ ఊరినీ – తమ అడవినీ వదలిపెట్టరేమోననే ఆలోచన. పక్క ఊరిలో తవ్విన యురేనియం వల్ల తామూ ప్రమాదంలో పడతామేమోననే భయమూ ఉంది.
“ఇక్కడ తవ్వుకోమని మా ఊరు (అమ్రాబాద్ మండలం) చెప్పాల. కానీ మా ఊరికి చెప్పకుండానే అన్నీ చేసేశారు. ఇప్పుడు మాకేం అవుతుందో అర్థం కావడం లేదు” అంటూ నిట్టూర్పు విడిచారు ఐతయ్య.
యురేనియం సర్వే పరిధిలో లేని గ్రామంలోని పరిస్థితి ఇది. సర్వే చేసే ప్రాంతాల్లోనైతే నిరసనలు తీవ్రంగా జరుగుతున్నాయి.
