వాషింగ్టన్: హ్యూస్టన్‌లో భారతీయ అమెరికన్లు నిర్వహించనున్న ‘హౌదీ మోదీ’ కార్యక్రమంలో ప్రధాని మోదీతో కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేదిక పంచుకొనున్నారు. ఈ విషయాన్ని శ్వేతసౌధం ఆదివారం ప్రకటించింది. వారం రోజుల అమెరికా పర్యటన సందర్భంగా మోదీ టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో జరిగే సభలో మోదీ అక్కడి భారతీయ అమెరికన్లనుద్దేశింది ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 50వేల మంది హాజరు కానున్నారు. ఒకే ప్రదేశంలో ఇంత భారీ ఎత్తున భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ఓ అమెరికా అధ్యక్షుడు ప్రసంగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇరు దేశ ప్రజల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఈ వేదికను గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు శ్వేత సౌధం మీడియా కార్యదర్శి స్టెఫనీ గ్రిషమ్ అన్నారు. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య వ్యూహాత్మక, వాణిజ్య బంధాల్ని మరింత పటిష్ఠం చేయడం అవసరమని పేర్కొన్నారు. గత నెల ఫ్రాన్స్‌లో జీ-7 సదస్సులో ఇరు దేశాధినేతల భేటీ సందర్భంగా హ్యూస్టన్ సభకు హాజరుకావాలని ట్రంప్‌ని మోదీ కోరారని అమెరికా అధికారులు తెలిపారు. ఇద్దరి మధ్య ఉన్న బలమైన మైత్రికి సూచికగా ట్రంప్ అందుకు అంగీకరించారన్నారు.
మోదీ, ట్రంప్ ఒకే వేదికను పంచుకోవడం ‘చరిత్రాత్మకం, అపూర్వం’ అని అమెరికాలోని భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా అన్నారు. ఉభయ దేశాల మధ్య ఉన్న సహజ మైత్రికి ఇది నిదర్శనమన్నారు. మోదీ రెండోసారి ఎన్నికయిన తర్వాత భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించడం ఇదే తొలిసారి.
ఈ పర్యటనలో భాగంగా మోదీ న్యూయార్క్ లేదా వాషింగ్టన్‌లో ద్వైపాక్షిక భేటీ కూడా జరిగే అవకాశం ఉంది. ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో మోదీ ఈనెల 27న ప్రసంగిస్తారు. తర్వాత కొద్దిసేపటికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతారు. ఈనెల 28న అమెరికన్ అగ్ర సీఈవోలతో కూడా మోదీ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమచారం. ఈ కార్యక్రమం సందర్భంగా ఉభయ దేశాల మధ్య ఓ వాణిజ్య ఒప్పందాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
