ముంబయి: ప్రపంచంలో మూడు రకాలైన ప్రజలుంటారని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. కొందరు ఎలాంటి పనిని ప్రారంభించరని అందులో ఏదైనా అడ్డంకులు వస్తాయన్న భయంతో ముందుగానే ఆగిపోతారని తెలిపారు. ఇక రెండో రకం వ్యక్తులు పనిని ప్రారంభించి అవరోధాలు రావడంతో మధ్యలోనే ఆపివేస్తారని అయితే చివరి రకం వ్యక్తులు మాత్రం అన్ని అడ్డంకులను, కష్టాలను అధిగమించి లక్ష్యాన్ని చేరుకుంటారని ఇస్రో శాస్త్రవేత్తలు ఈ తరగతికి చెందినవారని వెల్లడించారు. చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా ల్యాండర్ విక్రమ్ చంద్రునిపై దిగే సమయంలో చివరిక్షణంలో ఏర్పడిన సాంకేతిక లోపంతో ఆగిపోయిన విషయం తెలిసిందే.
ముంబయిలో ప్రధాని మోదీ మెట్రోరైలు ను ప్రారంభించారు. మెట్రో కోచ్‌లను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ప్రభుత్వ రంగ సంస్థ బీఈఎంఎల్ తయారుచేసింది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ కోచ్‌లను తయారుచేశారు. ముంబయిలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆయన పచ్చజెండా వూపారు. దేశానికి ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో మూడు మెట్రో మార్గాలను ప్రధాని ప్రారంభించారు. ముంబయిలో దాదాపు రూ. 20 వేల కోట్లతో వివిధ మౌలిక ప్రాజెక్టులను ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్రో శాస్త్రవేత్తల పనితీరును చూసి తాను స్ఫూర్తి పొందినట్టు తెలిపారు. రాత్రింపగళ్లు వారు కష్టపడుతున్న అంశాన్ని ప్రస్తావించారు. వారి దగ్గర నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సివుందని ఆయన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రశంసించారు. అంతకు ముందు మోదీ లోక్‌మాన్యసేవా సంఘ్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకున్ని దర్శించుకున్నారు.
ముంబయి మెట్రో మూడో దశలో భాగంగా కొలాబా-బాంద్రా నిర్మాణాన్ని 33.5 కి.మీ. మేర నిర్మించారు. రుతుపవన కాలంలో ముంబయిలో విపరీతమైన వర్షం కురుస్తుంది. దీంతో అనేక చోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుంటుంది. మెట్రోను విస్తరించడంతో ట్రాఫిక్‌సమస్య నుంచి విముక్తి కలుగుతుందని మెట్రో వర్గాలు పేర్కొన్నాయి. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశంలోనే తయారీపై దృష్టిపెట్టారు. దేశంలోని పలు మెట్రోలకు విదేశాలకు చెందిన సంస్థలు రైళ్లను సరఫరా చేసేవి. ముంబయి మెట్రో దశ 3లో దేశీయంగా తయారైన మెట్రోరైళ్లను ప్రవేశపెట్టడం విశేషం.
అంతకుముందు బెంగళూరు నుంచి ముంబయికి చేరుకున్న ప్రధానికి ఘనస్వాగతం లభించింది. ముంబయిలో జరిగిన పలు కార్యక్రమాల్లో ప్రధానితో పాటు ఈ రాష్ట్ర గవర్నర్ భగత్ కొష్‌యారి, ఆ రాష్ట్ర సీఎం దేవేంద్రఫడ్నవీస్‌లతో పాటు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
