పవన, సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల సమీక్ష విషయంలో ఇప్పటికే జగన్ సర్కార్‌కు హైకోర్టు షాకిచ్చిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 63ను జారీ చేసింది. ఈ విషయంపై మంగళవారం నాడు విచారించిన హైకోర్టు జీవోను కొట్టేసింది. అంతేకాదు.. పీపీఏలపై ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చలకు రావాలని ఇచ్చిన ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టిపారేసింది.
ఇప్పటివరకూ నిర్ణయించిన ధర ప్రకారం ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్‌లో ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఏపీ ఈఆర్సీకి వెళ్లాలని ప్రభుత్వానికి, పీపీఏలకు హైకోర్టు సూచించింది. ఆరు నెలల్లోపు వివాదాన్ని పరిష్కరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివిధ కారణాలతో విద్యుత్‌ను తీసుకోవడం నిలిపివేసిన సంస్థల నుంచి వెంటనే సరఫరాను పునరుద్ధరించాలని సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే.. ‘మీరు చేపట్టిన చర్యలు సదుద్దేశంతో కూడినవేనా? విద్యుత్ కొనుగోలు చేయబోమని చెప్పడం కూడా సదుద్దేశమైన చర్యేనా? మేం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చాక కూడా మీరు విద్యుత్ కొనుగోలు చేయబోమని ఉత్పత్తి సంస్థలకు చెప్పడమంటే ప్రాథమికంగా మా ఆదేశాల ఉల్లంఘనే’ అంటూ ఇప్పటికే ఓ సారి ప్రభుత్వం తీరుపట్ల హైకోర్ట్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే.
