రామమందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును విశ్వసిద్దాం.. అంటూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. రెండు, మూడు వారాలుగా కొంతమంది.. రామమందిరం అంశంపై ఉన్నవీ లేనివీ మాట్లాడుతున్నారని, అయితే.. మనం సుప్రీంకోర్టును గౌరవించడం తప్పనిసరి అని అన్నారు. దేశ రాజ్యాంగంపైన, న్యాయవ్యవస్థపైనా మనకు విశ్వాసం ఉండాలన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాసిక్‌లో నిర్వహించిన మహా జనాదేశ్ యాత్ర ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు మోడీ. రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం.. కశ్మీరీలను ప్రేమతో హత్తుకుందాం.. కశ్మీర్‌లోయలో సరికొత్త స్వర్గాన్ని సృష్టిద్దాం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణంపై శివసేన పదేపదే డిమాండ్ చేస్తోంది. రామ మందిరం అంశం 1992 నుంచి కొనసాగుతూనే ఉందని.. ఇంకెన్నాళ్లు వేచి ఉండాలని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు.. కోర్టు ఆదేశాల కోసం వేచి చూడకుండా.. ఆర్టికల్ 370పై ధైర్యంగా నిర్ణయం తీసుకున్నట్టే కేంద్రం రామమందిరంపైనా కూడా ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలని.. ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి అయోధ్యలో ఆలయాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు.. అయితే, శివసేన పేరు ప్రస్తావించకుండా ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ.. రెండు మూడు వారాలుగా కొంతమంది.. రామమందిరం అంశంపై ఉన్నవీ లేనివీ మాట్లాడుతున్నారు. కానీ, మనం సుప్రీంకోర్టును గౌరవించడం తప్పనిసరి. ఎందుకంటే ఆ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఆ కేసుకు సంబంధించి అన్ని పక్షాలూ కోర్టులో తమతమ వాదనలు వినిపిస్తున్నాయని తెలిపారు.
