పాక్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు నేపాల్ మీదుగా భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. వీరు దీపావళి రోజున దాడులకు ప్రణాళికలు రచిస్తున్నారని గురువారం అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదుల మధ్య టెలిఫోన్ సంభాషణను గుర్తించిన నిఘా అధికారులు, ఉగ్ర కుట్ర చాలా పెద్దదని తేల్చారు. భారత్‌లోకి చొరబడ్డాక తమ మనుషులను దిల్లీలో కలుసుకొనేలా ప్రణాళిక రచించినట్లు వెల్లడించారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో సైనికాధికారులు హై అలర్ట్ ప్రకటించారు.
ఉగ్రవాదుల ఫోన్ సిగ్నల్‌ను బట్టి వారిని చివరిసారిగా ఇండో-నేపాల్ సరిహద్దు వద్ద ఉన్నట్టు గుర్తించామని తెలిపారు.
నిఘా వర్గాల హెచ్చరికల మేరకు బుధవారం కూడా పంజాబ్, జమ్ములోని రక్షణ స్థావరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరాల్లో ఆరెంజ్ అలర్ట్ (సన్నద్ధత హెచ్చరిక) చేసినట్లు ఆర్మీ అధికారులు ఓ జాతీయ వార్తాసంస్థతో అన్నారు.
రెండు నెలలుగా భారత్‌కు ఉగ్రవాదుల నుంచి ముప్పు మరింత పెరిగిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు తర్వాతి నుంచి దాదాపు 60 మంది వరకూ ఉగ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి చొరబడ్డారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. పర్వదినాల వేళ రద్దీ సమయాల్లో పేలుళ్లు జరిపే అవకాశముందని గతంలోనే హెచ్చరించాయి.
