న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడితే చాలు పాకిస్థాన్ సంతోషం వ్యక్తం చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలనే పాకిస్థాన్.. ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించిందని అన్నారు. సిల్వెస్సా, దద్రానగర్ హవేలీలో జరిగిన బహిరంగసభలో అమిత్ షా మాట్లాడారు.
జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 ఆర్టికల్‌ను రద్దు చేస్తే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని, ఈ మేరకు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలనే పాకిస్థాన్ ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించింది. ఇందుకు కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలని అమిత్ షా విమర్శించారు. దేశ వ్యతిరేకులకు మద్దతుగా నిలుస్తారా? అంటూ ప్రశ్నించారు.
తన పర్యటనను అడ్డుకోవడం చూస్తుంటే జమ్మూకాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు లేవనే అనుమానాలు కలుగుతున్నాయని రాహుల్ గాంధీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలో హింస జరుగుతుందనే అనుమానాలను వ్యక్తం చేశారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ఊటంకించడం గమనార్హం. ఈ నేపథ్యంలో తప్పుడు ప్రచారం చేస్తూ దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని రాహుల్‌పై మండిపడ్డారు అమిత్ షా.
జమ్మూకాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని ఆ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసమే రద్దు చేశామని హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. జమ్మూకాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, ఆ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అమిత్ షా వ్యాఖ్యానించారు.
