ఏరూపంలోనైనా వినాయకుడు ఉమిడిపోతాడు. చిన్న రావి ఆకులో కూడా వినాయకుడు ఇమిడిపోతాడు. రుద్రాక్షలు..కూరగాయాలు..పువ్వులు..ఇలా ఎన్నో రకాలుగా వినాయకుడు విగ్రహాలను తయారు చేయటం చూశారు. కానీ ఇప్పుడు మనం చూసే వినాయకుడు మాత్రం వెరీ వెరీ కాస్ట్లీ. ఒకటీ రెండు కాదు ఏకంగా 21 దేశాలకు చెందిన కరెన్సీతో వినాయకుడు కొలువుదీరాడు. ఈ నోట్లు ఒరిజినల్ కాకపోయినా..గణేషుడి రూపంలోకి వచ్చాక ఆ లుక్కే వేరు. మరి ఆ కరెన్సీ గణేషుడు ఎక్కడున్నాడు..ఎవరు తయారు చేశారో తెలుసుకుందాం..
కర్ణాటకలోని ఉడుపికి చెందిన మణిపాల్ శాండ్ హార్ట్ టీమ్‌కు చెందిన శ్రీనాథ్ మణిపాల్, వెంకీ పాలిమర్, రవి హిరేబెట్టు అనే ముగ్గురు ఆర్టిస్టులు 21 దేశాలకు చెందిన ఆర్టిఫిషియల్ కరెన్సీ నోట్లతో వినాయకుడి ప్రతిమను తయారు చేశారు. ఈ విగ్రహం పొడవు 12 అడుగులుంది. కాగా ఈ 21 దేశాకలు చెందిన కరెన్సీలో ఇండియా కరెన్సీని ఎక్కువగా ఉపయోగించారు.
శ్రీలంక, బంగ్లాదేశ్, చైనా, ఆప్ఘనిస్థాన్, భూటాన్, యూఏఈ, యూఎస్, ఇజ్రాయెల్‌తో పాటు పలు దేశాల కరెన్సీని ఉపయోగించి గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కరెన్సీ వినాయకుడికి విశ్వ ధనదీప గణేశగా నామకరణం చేశారు. గతంలో పేపర్, చేనేత వస్తువులు, బిస్కెట్లు, గింజలతో గణేశ్ ప్రతిమలను తయారు చేశారు వీరు. కరెన్సీ వినాయకుడు విశేషంగా ఆకట్టుకుంటున్నాడు.
