జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితిలో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు. ‘సమకాలీన ప్రపంచంలో గాంధీ సిద్ధాంతాల ఔచిత్యం’ ఇతివృత్తంతో జరిగిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ఐరాస రూపొందించిన ప్రత్యేక స్టాంపును దేశాధినేతల సమక్షంలో ప్రధాని ఆవిష్కరించారు. గాంధీపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినందుకు ఐరాసకు ధన్యవాదాలు తెలిపారు.
”గాంధీ భారతీయుడైనప్పటికీ.. ఆయన సిద్ధాంతాలు భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ఈ వేడుకే అందుకు నిదర్శనం. గాంధీతో పరిచయం లేని వారు సైతం ఆయన జీవితంతో ప్రభావితం అయ్యారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ లేదా నెల్సన్ మండేలా.. ఇలా ఎవరైనా కావచ్చు వారి ఆలోచనలన్నీ గాంధీ జీవితం, ఆయన ఆశయాలతో ప్రభావితం అయ్యాయి. ప్రజాస్వామ్య వ్యవస్థ నిజమైన సత్తా ఏమిటో గాంధీ ఆనాడే చెప్పారు. ప్రజలు పాలకులపై కాకుండా తమపై తాము ఎలా ఆధారపడాలో గాంధీ మార్గనిర్దేశం చేశారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా సమాజం ఎలా ముందుకు వెళ్లాలో పథనిర్దేశం చేశారు. ఈ విధానాలే నేడు భారత్ ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు పరిష్కారం చూపుతోంది. ప్రజల అంతర్గత శక్తిని మేల్కొలిపి, మార్పు తీసుకురావడానికి గాంధీ ప్రయత్నించారు” అని మోదీ వివరించారు.
”ఇతరుల్ని ఎలా ఆకట్టుకోవాలి అనే యుగంలో మనం జీవిస్తున్నాం, కానీ, గాంధీ మాత్రం ఇతరుల్ని ఎలా ప్రేరేపించాలో నేర్పారు. ‘కృషి లేని సంపద’, ‘స్పృహ లేని ఆనందం’, ‘గుణం లేని జ్ఞానం’, ‘విలువల్లేని వ్యాపారం’, ‘మానవత్వం లేని శాస్త్రవిజ్ఞానం’, ‘త్యాగం లేని మతం’ ఈ ఏడు మనిషి దృష్టి మరల్చేవని వీటిని పట్ల జాగ్రత్తగా ఉండాలని గాంధీ సూచించారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాదం, అవినీతి లాంటి రుగ్మతల నుంచి మానవాళిని రక్షించుకోవడానికి ఈ ఏడు సూత్రాల అంశం నేటికీ ఆచరణీయమే. మెరుగైన సమాజాన్ని నిర్మించడంలో గాంధీ చూపిన మార్గం మనందరికీ స్ఫూర్తివంతంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను” అంటూ గాంధీ సిద్ధాంతాల్ని, సమకాలీన ప్రపంచంలో వాటి ఔచిత్యాన్ని మోదీ స్పష్టంగా వివరించారు.
