లండన్: కశ్మీర్ విషయంలో భారత్, పాకిస్తాన్ మధ్య మూడో దేశం మధ్యవర్తిత్వానికి గల అవకాశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ద్వద్వంగా తోసిపుచ్చారు. ఇరు దేశాలు అన్ని సమస్యలను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోగలవని ఆయన స్పష్టం చేశారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సమ్మిట్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ప్రధానితో సమావేశానికి ముందు తాను కశ్మీర్ అంశంపై ఆయనతో చర్చిస్తానంటూ ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలో… దీనిపై ప్రధాని స్పష్టమై వైఖరి వెల్లడించడం గమనార్హం. కశ్మీర్ విషయంలో తాను భారత్, పాకిస్తాన్ దేశాలకు మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ ట్రంప్ ఇటీవల పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మాట్లాడుతూ.. ”భారత్, పాకిస్తాన్ మధ్య చాలా ద్వైపాక్షిక సమస్యలు ఉన్నాయి. కాబట్టి మూడో దేశాన్ని దేన్నీ మేము ఇబ్బంది పెట్టదల్చుకోవడం లేదు. ఈ అంశాలన్నిటినీ ద్వైపాక్షికంగా చర్చించి పరిష్కరించుకోగలం” అని ప్రధాని పేర్కొన్నారు. 1947కు ముందు భారత్, పాకిస్తాన్ కలిసే ఉన్నాయనీ.. ఇరు దేశాలు చర్చించుకుని తమ సమస్యలను పరిష్కరించుకో గలవని తాను గట్టిగా నమ్ముతున్నానని ప్రధాని వివరించారు. ఇటీవల పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో జరిగిన ఫోన్ సంభాషణ సందర్భంగా… పేదరికం సహా ఇరు దేశాలు ఎదుర్కొంటున్న ఇతర అనేక అంశాలపై కలిసి కట్టుగా పనిచేద్దామని తాను చెప్పినట్టు గుర్తుచేశారు.
కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ… గత రాత్రి మోదీకి, తనకు మధ్య కశ్మీర్ అంశంపై చర్చ జరిగిందని తెలిపారు. భారత్, పాకిస్తాన్ రెండూ కలిసి దీన్ని పరిష్కరించు కోగలవని మోదీ చెప్పారని ఆయన అన్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంతో పాటు రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ ఈ నెల 5న భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే ట్రంప్, మోదీ తాజా సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఈ నిర్ణయాన్ని పాకిస్తాన్ తీవ్రంగా వ్యతిరేకించడంతో.. దాయాది దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టికల్ 370 రద్దు తమ అంతర్గత వ్యవహారమంటూ అంతర్జాతీయ సమాజానికి ఇప్పటికే స్పష్టం చేసిన భారత్… ఈ వాస్తవాన్ని పాకిస్తాన్ కూడా అంగీకరించాలని సూచించింది.
