వాతావరణ మార్పులపై మాటలు చాలన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మిగిలింది చేతల్లో చూపాలని కోరారు. వాతావరణాన్ని పరిరక్షించుకునేందుకు మాటలు కోటలు దాటుతున్నాయని .. కానీ పని మాత్రం జరగడం లేదన్నారు. ఆయన ఐక్యరాజ్యసమితి వేదికగా వాతావరణ మార్పుల అంశంపై ప్రసంగించారు. దీంతోపాటు పునరుత్పాదక వనరుల వినియోగం కూడా అవసరమేనని నొక్కి వక్కానించారు.
భారతదేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి క్రమంగా పెరిగిందని పేర్కొన్నారు మోడీ. తమతో 80 దేశాలు కలిసి పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకునే చర్యలపై మిగతా అధినేతలు దృష్టిసారించాలని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఇప్పటికే వాతావరణ మార్పులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఔన్సు ప్రాక్టీస్ టన్ను బోధనల కన్నా హితమైనదనే సామెతను వల్లెవేశారు. వాతావరణ మార్పుల వల్ల కలిగే అనర్థాలను ఇప్పటికే తెలుసుకున్నామని .. వాటిని నిర్మూలించేందుకు కఠినచర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
