EPFపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 8.65 శాతం వడ్డీ అందించాలని ప్రతిపాదనకు ఒకే చెప్పింది. 2018-19 కాలానికి సంబంధించి 6 కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం చేకూరనుంది. 2017-18 కాలానికి 8.55గా ఉండేది. ఈపీఎఫ్‌వో సంస్థ ఇకపై చందాదారుల క్లెయిమ్‌లను 8.65 శాతం వడ్డీతో చెల్లించనుంది. ఈఫీఎఫ్ రేటును 8.65 శాతానికి పెంచుతూ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ (ఫిబ్రవరిలో) నిర్ణయం తీసుకుంది. దీనికి కేంద్రం ఇప్పుడు ఆమోద ముద్ర వేసింది.
తమ సంస్థ దగ్గర సరిపడా మిగులు ఉందని ఆర్థిక శాఖకు ఈపీఎఫ్‌వో గతంలోనే చెప్పింది. మొత్తం రూ. 151.67 కోట్ల మిగులు, 8.7 శాతం వడ్డీ చెల్లిస్తే..రూ. 158 కోట్ల లోటు ఉంటుందని అంచనా. అందుకే 8.65 శాతం వడ్డీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపై జరిగే క్లెయిమ్‌లన్నీ కొత్త వడ్డీ రేటు ప్రకారమే మంజూరు కానున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి 8.55 శాతం వడ్డీ మాత్రమే లభిస్తుందనే సంగతి తెలిసిందే. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతం వడ్డీ ఉండగా…2015-16 ఆర్థిక సంవత్సరంలో 8.8 శాతం వడ్డీ రేటుగా ఉండేది.
