హాలీవుడ్ సినిమాలను తలపించే భారీ దొంతనం తమిళనాడు తిరుచ్చిలో లలితా జ్యువెలరీలో జరిగింది. దుకాణానికి వెనుక వైపు గోడకు పెద్ద రంధ్రం చేసిన ఇద్దరు దొంగలు షాపులోకి చొరబడి సుమారు 35 కిలోల బంగారు, వజ్రాభరణాలను దోచుకెళ్లారు. వాటి విలువ సుమారు రూ.15 కోట్లు అని అంచనా. చతిరామ్ బస్టాండ్‌కు సమీపాన ఉన్న ఈ దుకాణం ఎప్పుడూ అత్యంత రద్దీగా ఉంటుంది. బుధవారం ఉదయం ఉద్యోగులు వచ్చి షాప్‌ను తెరిచేసరికి, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఖాళీగా ఉండటంతో షాక్‌కు గురయ్యారు. ఇద్దరు దొంగలు ముసుగు ధరించి దొంగతనానికి పాల్పడినట్లు దుకాణంలో అమర్చిన సిసిటివి ఫుటేజ్‌లో రికార్డైంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు దుకాణాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇందులో మూడవ వ్యక్తి ప్రమేయం ఉందని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన తెల్లవారు జామున 2 నుండి 4 గంటల మధ్య జరిగినట్లు చెబుతున్నారు.
తన షాపులో చోరీ జరిగిందని తెలుసుకున్న లలితా జ్యువెల్లరీ యజమాని కిరణ్ కుమార్ చెన్నై నుండి తిరుచ్చికి చేరుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 13 కోట్ల విలువ చేసే బంగారు, ప్లాటినం, డైమండ్ ఆభరణాలు చోరీకి గురయ్యాయని తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని తెలిపారు.
