న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి పీ చిదంబరంకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ముందస్తు బెయిల్ ఇవ్వలేమంటూ తేల్చి చెప్పింది.
ఇలాంటి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. బెయిల్ ఇస్తే చిదంబరం ఈ కేసుపై ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఆర్టికల్ 32 ప్రకారం ముందస్తు బెయిల్ ఇవ్వడం అనేది ప్రాథమిక హక్కేమీ కాదని స్పష్టం చేసింది. తీవ్రమైన ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని తెలిపింది.
కాగా, చిదంబరంను ప్రశ్నించిన విధానాన్ని, ప్రశ్నలను సీల్డ్ కవర్‌లో సుప్రీంకోర్టుకు ఈడీ సమర్పించింది. జస్టిస్ ఆర్ బానుమతి, ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఎదుట సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ నివేదికను సమర్పించారు.
ఆగస్టు 21న రాత్రి చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 15రోజులపాటు సీబీఐ కస్టడీకి ఇచ్చింది కోర్టు. ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన నాటి నుంచి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు చిదంబరం. అయితే, ఇక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైంది.
