లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో మంత్రులు ఇక నుంచి ఎవరి ఆదాయ పన్నులు వారే చెల్లించుకోనున్నారు. ఈ మేరకు అక్కడి రాష్ట్రప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు దశాబ్దాలుగా మంత్రుల ఆదాయపు పన్ను ప్రభుత్వమే చెల్లిస్తున్న విధానానికి స్వస్తి పలకనున్నారు. అయితే మంత్రుల పన్ను ప్రభుత్వమే చెల్లిస్తోందని కొందరు రాజకీయ నాయకులకు కూడా తెలియకపోవడం గమనార్హం. యూపీ మాజీ ఆర్థిక మంత్రి లాల్జి వర్మ తనకు ఈ చట్టం ఉందన్న విషయమే తెలియదని చెప్పడం అందర్ని విస్మయానికి గురి చేసింది. 1981లో వీపీ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసన సభకు ఎన్నికైన వారిలో ఎక్కువ మంది పేదలు ఉండడంతో, వారు చెల్లించాల్సిన ఆదాయపు పన్ను ప్రభుత్వమే చెల్లించేలా చట్టం తెచ్చారు. అదే విధానం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని ఓ వార్తా సంస్థ బయటపెట్టడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు.
1981 నాటి చట్టంతో ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గానికి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది. అనంతరం వచ్చిన సీఎంలు, మంత్రులందరికీ ప్రభుత్వమే ఆదాయపు పన్ను చెల్లించింది. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోనూ ఇదే కొనసాగుతోంది. వీపీ సింగ్ తర్వాత అనేక మంది ధనిక సీఎంలు, మంత్రులు పని చేశారు. ఎన్నికల అఫిడవిట్లలో రూ. 111 కోట్ల ఆస్తి చూపిన బీఎస్పీ అధినేత్రి మాయావతి, రూ.37 కోట్ల ఆస్తి ఉన్నట్లు పేర్కొన్న ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, రూ. 95 లక్షల ఆస్తి చూపిన ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లు ఉన్నారు. ఆ చట్టం వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధుల జీతాలు అనేక రెట్లు పెరిగాయి. అయినా ఇంకా అదే పాత విధానాన్ని కొనసాగిస్తూ రావడం విమర్శలకు దారితీసింది.
