గోదావరి మరోసారి ఉగ్రరూపం దాలుస్తోంది. గత నెలలో వచ్చిన వరదల నుంచి తేరుకోక ముందే మరోసారి వరద ముప్పు ఏజెన్సీ ప్రజలను భయపెడుతోంది. భద్రాచలం వద్ద 50 అడుగులు దాటిన గోదారమ్మ, ధవళేశ్వరం వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఆందోళనకరంగా మారుతోంది.
ఇప్పటికే ఓసారి గోదావరి నదికి వరదలు రాగా.. ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలతో.. మరోసారి భారీగా వరద వస్తోంది. ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. కుంట వద్ద శబరి నది కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీ ఎత్తున వరద వచ్చి చేరుతుండటంతో.. కూనవరం, పోలవరం ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నంలో వరద ఉద్ధృతి పెరగడంతో నాలుగు రోజులుగా 36 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దేవీపట్నం, తొయ్యేరు, పూడిపల్లి, పోచమ్మగండి వద్ద దాదాపు 200 ఇళ్లు నీట మునగడంతో బాధితులంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. గండిపోచమ్మ అమ్మవారి ఆలయంలోకి వరదనీరు భారీగా చేరడంతో ఆలయానికి తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేశారు. వరద పెరగడంతో గోదావరి ఒడ్డు గ్రామాలైన కచ్‌లూరు నుంచి కొండ మొదలు వరకు ఉన్న 14 గ్రామాల గిరిజనులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
కూనవరం, వీఆర్ పురంలను వరదలు ముంచెత్తడంతో.. రెండు మండలాలకు బాహ్యప్రపంచంతో తెగిపోయాయి. కూళ్లపాడు, దూగుట్ట, కొండాయిగూడెం, కాసవరంలలో.. 800 ఎకరాల్లో పంటలు ముంపునకు గురైయ్యాయి. పోలిపాక, కొండ్రాజుపేట కాజ్‌వేలపై వరదనీరు ప్రభావం చూపడంతో.. 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు-వీఆర్‌పురం మధ్య 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా.. వీఆర్ పురంలో 4 వేల ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం 13 లక్షల క్యూసెక్కులకు చేరడంతో.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించిన అధికారులు.. బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాలుగు రోజులుగా వరద ఉన్నా అధికారులు భోజనాలు ఏర్పాటు చేయలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వరద ముప్పు గ్రామాల్లో 2500 కుటుంబాలకు భోజనాలు సమకూరేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. వరద ముంపు గ్రామాల్లో తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు అధికారులు.
