తెలుగు సినీ నటుడు వేణు మాధవ్ బుధవారం మరణించారు. కాలేయ సంబంధ వ్యాధితో గత కొంత కాలంగా బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మధ్యాహ్నం 12.21 గంటలకు కన్నుమూశారని సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
మంగళవారమే ఆయన పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయన్ను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు మార్చి చికిత్స అందించారు.
గతంలో పలుమార్లు వేణుమాధవ్ చనిపోయారని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ఇవ్వగా.. వాటిని ఖండిస్తూ ఆయన ప్రకటనలు ఇచ్చేవారన్న విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకుంటున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నల్గొండ జిల్లా, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలోని కోదాడలో జన్మించిన వేణుమాధవ్ మిమిక్రీ ఆర్టిస్టుగా తన ప్రస్థానం మొదలు పెట్టారు. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా నటించిన ‘సంప్రదాయం’ సినిమాతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన ఆయనకు పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ‘తొలిప్రేమ’ సినిమాతో గుర్తింపు లభించింది.
వేణు మాధవ్ 170కి పైగా సినిమాల్లో నటించారు. ఆది, దిల్, సింహాద్రి, సై, లక్ష్మి, ఛత్రపతి.. ఇలా పలు సినిమాల్లో ఆయన పాత్రలు ప్రేక్షకులను బాగా అలరించాయి.
ఆయన చివరిగా నటించిన చిత్రం 2016లో విడుదలైన డాక్టర్ పరమానందయ్య స్టూడెంట్స్ గ్యాంగ్.
హంగామా, భూకైలాస్, ప్రేమాభిషేకం వంటి చిత్రాల్లో వేణుమాధవ్ హీరోగా కూడా నటించారు. పలు తమిళ చిత్రాల్లోనూ, తెలుగు టీవీ కార్యక్రమాల్లోనూ నటించారు.
2006లో ఉత్తమ హాస్య నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు.
