న్యూఢిల్లీ, ఆగస్టు 29: ఉగ్రవాదాన్ని పెంచి పోషించడాన్ని మానుకోవాలని, మంచి పొరుగు దేశంగా మెలగాలని పాకిస్తాన్‌కు భారత్ హితవు పలికింది. బాధ్యతాయుతంగా మెలుగుతూ, ఆలోచించి ప్రకటనలు చేయాలని పాక్ నేతలకు సూచించింది. జమ్మూ కాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను కల్పించే రాజ్యాంగంలోని 370 ఆర్టికల్‌ను రద్దు చేయడం తమ ఆంతరంగిక అంశమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమవుతున్నాయని గురువారం విలేఖరులతో మాట్లాడుతూ ఆయన అన్నారు. వారి మాటలు ఎందుకూ కొరగావని వ్యాఖ్యానించారు. భారత ఆంతరంగిక వ్యవహారంపై పాకిస్తాన్ నాయకులు బాధ్యతారాహిత్యంగా చేస్తున్న వ్యాఖ్యలను భారత్ ఖండిస్తున్నదని కుమార్ తెలిపారు.బెదిరింపులకు పాల్పడడాన్ని మానుకోవాలని అన్నారు. ఇరుదేశాల మధ్య అణు యుద్ధం జరిగే అవకాశం ఉందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల చేసిన ప్రకటన సరిహద్దులో ఉద్రిక్తతలకు దారితీసింది. అక్టోబర్‌లో భారత్‌తో అమీతుమీ తేల్చుకుంటామని పాకిస్తాన్ రైల్వేశాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ బుధవారం ఓ ఇంటర్వ్యూలో పేర్కొనడం కూడా వివాదానికి కారణమైంది. ఈ ప్రకటనలను కుమార్ ప్రస్తావిస్తూ- భారత ప్రజలను భయాందోళనకు గురిచేయడమే పాకిస్తాన్‌కు లక్ష్యంగా కనిపిస్తోందని అన్నారు. అయితే వాస్తవాలకు ఏ మాత్రం సంబంధం లేకుండా పాకిస్తాన్ మాట్లాడుతున్నదని, ప్రత్యక్ష, పరోక్ష హెచ్చరికలు చేస్తున్నాయని అన్నారు. భారత భూ భాగంపై జిహాదీలు విరుచుకు పడతారని, తుది స్వాతంత్య్ర సమరాన్ని కొనసాగిస్తారని పాక్ మంత్రి ప్రకటించడాన్ని బాధ్యతారాహిత్యంగా కుమా ర్ అభివర్ణించారు.
అంతర్జాతీయంగా అన్ని దిక్కుల నుంచి వత్తిడి పెరగడంతో పాకిస్తాన్ దిక్కుతోచుకుండా ఉందని, అందుకే విచక్షణారహితంగా ప్రకటనలు చేస్తున్నదని కుమార్ ధ్వజమెత్తారు. పాకిస్తాన్ ఏ విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నదో యావత్ ప్రపంచం గమనిస్తున్నదని ఆయన అన్నారు. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు మనదేశంలోకి చొరబడి విధ్వంసాలు సృష్టించే ప్రమాదం ఉన్నట్టు సమాచారం అందిందని ఆయన తెలిపారు. ఈ విధంగా ఉగ్రవాదులను భారతదేశంలోకి పంపించడాన్ని మానుకొని, ఒక బాధ్యతాయుత పొరుగుదేశంగా ఉండాలని పాకిస్తాన్‌కు ఆయన హితవు పలికారు. కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఐక్యరాజ్య సమితికి పాకిస్తాన్ మంత్రి షిరీన్ మజారీ లేఖ రాయడాన్ని ప్రస్తావిస్తూ, దానిపై స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి లేఖలపై వ్యాఖ్యలే చేస్తే, వాటికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని అన్నారు.
చిత్రం…మీడియాతో మాట్లాడుతున్న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్
