ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) బుధవారం ఒక క్షిపణి పరీక్ష నిర్వహించింది.
‘మ్యాన్ పోర్టబుల్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిసెల్(ఎంపీఏటీజీఎం)’ అనే ఈ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించారంటూ డీఆర్‌డీవోను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు.
యుద్ధ ట్యాంకర్‌కు నమూనా లాంటి ఒక లక్ష్యంపై ఈ క్షిపణి ‘టాప్ అటాక్ మోడ్’లో కచ్చితత్వంతో దాడి చేసి ధ్వంసం చేసిందని ఆయన ట్విటర్‌లో చెప్పారు. ఈ పరీక్ష లక్ష్యాలన్నీ అందుకున్నట్లు తెలిపారు.
భారత సైన్యానికి, డీఆర్‌డీవోకు ఈ విజయం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు.
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణి బరువు తక్కువగా ఉంటుంది. పరీక్షలో ఇది దాదాపు రెండున్నర కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించింది.
