రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక కోసం బీజేపీ అధిష్టానం తీవ్రంగా సమాలోచనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పదవికి హెచ్.రాజాను ఎంపిక చేయాలని కోరుతూ ఆయన మద్దతుదారులు ‘మోదీ ఆర్మీ’ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో నగరంలో ఈ నెల 22వ తేదీ నిర్వహించనున్న సభ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకోనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షు రాలిగా ఉన్న తమిళిసై సౌందర్‌రాజన్ తెలంగాణా రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఖాళీగా ఉన్న అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ఆ పార్టీ నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ పార్టీ సంస్థాగత ఎన్నికలు అక్టోబరు 15వ తేదీ ప్రారంభమై నవంబరు నెలాఖరు వరకు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందే రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు ఆ పార్టీ అధిష్ఠానం మూడు మార్గాల్లో ఆలోచిస్తున్నట్లు సమాచారం.
సీనియర్ నేతలలో ఒకరిని నియమించాలా? ఇతర పార్టీల నుంచి పార్టీలో చేరిన ప్రముఖుడిని ఎంపిక చేయాలా? 35 ఏళ్లలోపున్న యువకుడికి అధ్యక్ష పదవిని కట్టబెట్టాలా అని మూడు మార్గాలను అధిష్ఠానం పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో ‘మోదీ ఆర్మీ’ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ స్థానిక విరుగంబాక్కం ఆర్కాడు రోడ్డులో ఉన్న అమృ తానందమయి కల్యాణ మండపంలో సోషల్ నెట్‌వర్క్ మహానాడును నిర్వహించనున్నా రు. ఉదయం 9.30 గంటలకు ప్రారం భమయ్యే ఈ మహానాడు మధ్యాహ్నం 1 గంటలకు జరుగనుంది. ‘రండి… అందరం కలసి రథాన్ని లాగుదాం’ అనే నినాదంతో ఆ పార్టీ కార్యకర్తలకు ఇప్పటికే ఆహ్వాన లేఖలు పంపించారు. మహాసభలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా, శ్రీనివాసన్, కల్యాణరామన్, డాల్ఫిన్ శ్రీధర్, ప్రకాష్ తదితరులు ప్రసంగించనున్నారు.
ఈ విషయమై పార్టీ శ్రేణులు మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం హెచ్.రాజా వేచి ఉన్నారని, ఈ పర్యాయమైనా ఆ పదవికి ఆయనను ఎంపిక చేయాలని కోరుతూ ఆయన మద్దతుదారుల ఆధ్వర్యంలో ‘మోదీ ఆర్మీ’ ఏర్పాటైందన్నారు. గతంలో రాష్ట్ర అధ్యక్ష పదవి కోరుతూ రాజా అభిమానులు ‘మోదీ పేరవై’ పేరిట నిర్వహించిన మహాసభ ఆ పార్టీలో సమస్యలు సృష్టించింది. కేంద్ర మాజీ మంత్రి పొన్.రాధాకృష్ణన్ స్థానిక బీజేపీ రాష్ట్ర కార్యాలయం కమలాలయానికి వచ్చి ప్రశాంతంగా తన పనులను చూసుకొని వెళుతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల కమలాల యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఓ మహిళా కార్యకర్త బహిరంగా వ్యాఖ్యానిస్తూ కొద్దిసేపు కామెడీ చేశారు. దీన్ని గమనించిన పొన్.రాధాకృష్ణన్ ‘ఎవరు అనవసరంగా కామెడి చేస్తూ నవ్వుతున్నారా? పార్టీ పనుల్లో చురుగ్గా పాల్గొనండి’ అంటూ వ్యాఖ్యానించారు. దీన్ని విన్న నిర్వాహకులు అధ్యక్ష పదవి ఆయనకు ఖరారైందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హెచ్.రాజా మద్దతుదారులు నగరంలో నిర్వహించనున్న మహానాడు ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందోనని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి.
