హైదరాబాద్ : ఎప్పటిలాగే ఈసారి కూడా బాలాపూర్ లడ్డు యాక్షన్ ఉత్కంఠభరితంగా సాగింది. 28 మంది పాల్గొన్న వేలం పాటలో చివరకు కొలన్ వంశీయులు లడ్డును దక్కించుకున్నారు. గతేడాది రికార్డును బ్రేక్ చేస్తూ ఈసారి 17 లక్షల 60 వేల రూపాయలు పలికింది. పోటాపోటీగా సాగిన వేలం పాటలో చివరకు కొలన్ రాంరెడ్డి బాలాపూర్ లడ్డును దక్కించుకున్నారు.
బాలాపూర్ లడ్డు వేలం పాట గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తారంటే అతిశయోక్తి కాదు. ఏ ఏటికాయేడు లడ్డు అధిక ధర పలుకుతోంది. 1994లో ప్రారంభమైన ఈ లడ్డూ వేలం గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. బాలాపూర్ లడ్డూ వేలం పాట వీక్షించడానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తారు. ఈసారి కూడా చాలామంది వేలం పాట చూసేందుకు ఎగబడ్డారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వేలం పాట గతేడాది సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పోయిన సంవత్సరం 16 లక్షల 60 వేల రూపాయల ధర పలికింది లడ్డు. ఈసారి ఆ రికార్డును బ్రేక్ చేస్తూ మరో లక్ష రూపాయలు అదనంగా ధర పలికింది. ఈ ఏడు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొందరు వేలం పాటలో పాల్గొనడం విశేషం. నెల్లూరు, కర్నూలు ప్రాంతానికి చెందినవారు బాలాపూర్ లడ్డూ వేలంలో పాల్గొన్నారు.
1994లో 450 రూపాయలతో ప్రారంభమైన బాలాపూర్ లడ్డు ప్రస్థానం ఏ ఏటికాయేడు అధిక ధర పలుకుతోంది. అయితే కొలన్ వంశస్థులు ఈసారి దక్కించుకోవడం ఆరోసారి. కొలన్ రాంరెడ్డి ఈసారి 17 లక్షల 60 వేల రూపాయలకు వేలం పాడి లడ్డును సొంతం చేసుకున్నారు. 2 కిలోల వెండి గిన్నెలో 21 కిలోల బరువు తూగే లడ్డును దక్కించుకున్నారు. ఈ లడ్డును సొంతం చేసుకుంటే తమకు అంతా మంచే జరుగుతుందనేది భక్తుల నమ్మకం. ఆ లడ్డును బంధుమిత్రులకు ప్రసాదంగా పంచడంతో పాటు తమ పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయని విశ్వసిస్తారు.
