ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత సీబీఐ తొలి కేసుకు సిఫార్సు చేసారు. టీడీపీ హయాంలో గుంటూరు జిల్లా పల్నాడులో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారం పైన సీబీఐ విచారణకు ఏపీ కేబినెట్ నిర్ణయించింది. కొద్ది రోజుల క్రితం సీఐడీ హైకోర్టుకు అక్రమ మైనింగ్ జరిగిందని నిర్ధారించి నివేదిక అందించింది. ఇందులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు పేరు ప్రముఖంగా ఉంది. ఇక, ఇప్పుడు ఏపీ కేబినెట్ ఈ వ్యవహారం పైన సీబీఐ విచారణకు ఆదేశించటంతో ఆయనకు ఉచ్చు బిగిసినట్లే కనిపిస్తోంది. ఇదే సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం పైన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికకు సైతం కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక నవయుగ నుండి రద్దు చేసిన పోలవరం హైడల్పవర్ ప్రాజెక్టు కోసం ఇచ్చిన అడ్వాన్స్ లను తిరిగి రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపీలోకి తిరిగి సీబీఐ ఎంట్రీ ఇవ్వబోతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సీబీఐ విచారణకు అవకాశం లేకుండా నిర్ణయం తీసుకున్నారు. జగన్ సీఎం అయిన తరువాత సీబీఐ పైన ఉన్న అభ్యంతరాలను రద్దు చేసారు. ఇక, ఏపీలో సీబీఐ తొలి కేసు విచారణకు నిర్ణయం జరిగింది. గుంటూరు జిల్లా పల్నాడులో జరిగిన అక్రమ మైనింగ్ పైన హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ విచారణ చేసి కోర్టుకు నివేదిక సమర్పించింది. అందులో అక్రమాలు జరిగిన విషయం వాస్తవమేనని స్పష్టం చేసింది. దీంతో..కోర్టు దీని పైన సీబీఐ విచారణ పైన రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది. కోర్టు సూచనల మేరకు ఏపీ మంత్రివర్గం ఈ అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని సీబీఐ కు అప్పగించాలని నిర్ణయించింది. ఈ కేసులో ప్రధానంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు పాత్ర పైనే విచారణ సాగుతోంది. అయితే సీఐడి విచారణ పైన కోర్టులో వాదనలు సాగుతున్నాయి. బ్యాంకు లావాదేవీల పైన ఫోకస్ పెట్టాలని హైకోర్టు సూచించింది. దీంతో.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించటంతో యరపతినేనికి ఉచ్చు బిగిసినట్లుగానే కనిపిస్తోంది.

నవయుగకు పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో పాటు రూ. 3216.11 కోట్ల టెండర్ రద్దు నిర్ణయానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం హైడల్ పవర్ ప్రాజెక్టు నవయుగకు తప్పిస్తూ ఏపీ జెన్ కో తీసుకున్న నిర్ణయం పైన నవయుగ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో..కోర్టు జెన్ కో ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. దీని పైన ప్రభుత్వ అప్పీల్ కు వెళ్లగా కోర్టులో దీని పైన విచారణ సాగుతోంది. ఇదే సమయంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టర్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌ల రికవరీ చేయాలని నిర్ణయించింది. దీంతో పాటుగా మచిలీపట్నం పోర్టు ప్రైవేటు లిమిటెడ్‌కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగింపుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అదే విధంగా.. ఆశావర్కర్ల వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి మంత్రి వర్గం ఆమోద ముద్ర వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక, వైయస్సార్ పెళ్ళి కానుక కింద లక్ష రూపాయాలు ఇవ్వాలని ..వచ్చే శ్రీరామ నవమి నుండి అమలు చేయాలని కేబినెట్ లో నిర్ణయించారు.
ఇక, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన ప్రక్రియకు సంబంధించి ఆంజనేయరెడ్డి ఇచ్చిన నివేదికను కేబినెట్ ఆమోదించింది. ఇందులో భాగంగా మొత్తంగా ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలంటే కొన్ని సాంకేతిక సమస్యలు ఉండటంతో..ముందుగా రవాణా కార్పోరేషన్ ను ఏర్పాటు చేసి ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు. ఈ మేరకు కమిటీ ఇచ్చిన సిఫార్సులను కేబినెట్ ఆమోదించింది. దీని ద్వారా ఏపీ ప్రభుత్వం పైన ఏడాదికి మూడు వేల కోట్లకు పైగా భారం పడుతుంది. ఇక ఆర్టీసీలో ఛార్జీల విషయంలో నియంత్రణ..ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ వంటి వాటి పైన నిర్ణయం తీసుకున్నారు. ఆటో..టాక్సీ డ్రైవర్లకు పది వేల చొప్పున ఆర్దిక సాయం పధకానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
