సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లదు. ఫేక్ అకౌంట్లు ప్రతీ ఒక్కరికీ తలనొప్పిగా తయారయ్యాయి. ఫేస్ బుక్, ట్విట్టర్, యుట్యూబ్, గూగుల్ లల్లో ఇప్పటికే కోట్లలో ఫేక్ అకౌంట్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా సుప్రీం కోర్టు కీలక ఆదేశాలను కేంద్రప్రభుత్వానికి విడుదల చేసింది. సోషల్ మీడియాలో పర్సనల్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆధార్ నంబర్ ను పొందుపరిచే విషయమై అభిప్రాయాలను వెల్లడించాలని సూచిస్తూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులను జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే కాదు. ట్విట్టర్, గూగుల్, యుట్యూబ్ సంస్థల యాజమాన్యాలకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై అభిప్రాయాలను వెల్లడించాలని ఆదేశించింది. దీనిపై విచారణను సెప్టెంసబరు 13వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఫేస్ బుక్, ట్విట్టర్, యుట్యూబ్, గూగుల్ లల్లో వ్యక్తిగతంగా ఖాతాలను నిర్వహిస్తోన్న వారి ప్రొఫైళ్లను ఆధార్ కార్డుతో లింక్ చేయడం వల్ల నకిలీ వార్తలను అరికట్టవచ్చునని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు.
సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులను కించపరుస్తూ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు చేస్తున్నారని, అశ్లీలకరమైన ఫొటోలు, పోర్న్ వీడియోలు, ఉగ్రవాద కార్యక్రమాలను అరికట్టాలంటే అందుకు ఆధార్ కార్డులో లింక్ చేయడం మాత్రమే సరైన మార్గమని వేణుగోపాల్ అన్నారు.
ఎన్నికల సమయంలో రాజకీయమైన కారణాలతో కొన్ని నకిలీ వార్తలు, పరువు తీసే సమాచారాన్ని ఇష్టానుసారంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ అవుతున్నాయని పేర్కొన్నారు. ఫేస్ బుక్ ప్రొఫైళ్లను ఆధార్ కార్డుతో లింక్ చేయాలని కోరుతూ మద్రాస్, బోంబే, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లో ఇప్పటికే పలు పిటీషన్లు దాఖలైనా.. కాలం గడుస్తుంది కానీ, పిటీషన్లు విచారణకు రావట్లేదు.
ఈ క్రమంలో ఫేస్ బుక్ యాజమాన్యమే ఈ పీటీషన్ లను సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలని కోరింది. దీనిపై వాదనలను విన్న సుప్రీం కోర్టు.. కేంద్ర ప్రభుత్వంతో పాటు, ట్విట్టర్, యుట్యూబ్, గూగుల్ సంస్థల యాజమాన్యాలకు నోటీసులు పంపింది. ఫేస్ బుక్ దాఖలు చేసిన పిటీషన్ పై అభిప్రాయాలను వెల్లడించాలని ఆదేశాలు విడుదల చేసింది
