తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా కల్లిడైకురిచి పట్టణవాసులకు నిన్న పండుగరోజు. దాదాపు 37 సంవత్సరాల క్రితం మాయమైన తమ ఆరాధ్యదైవం నటరాజ స్వామి విగ్రహం మళ్లీ తిరిగివచ్చిన సందర్భంగా మంగళవారం ప్రజలంతా పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకున్నారు. నటరాజ విగ్రహాన్ని పట్టణమంతా ఊరేగించగా వేలాదిమంది ప్రజలు అడుగడుగునా హారతులు పట్టారు. గడచిన 19 సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలోని ఆర్ట్ గ్యాలరీలో ఉండిపోయిన నటరాజ విగ్రహాన్ని అక్కడి ప్రభుత్వం తమిళనాడుకు చెందిన విగ్రహాల విభాగానికి రెండు వారాల క్రితం అప్పగించింది. శ్రీ కులశేఖరముదయ్యార్ ఆలయం నుంచి 1982లో నటరాజ విగ్రహం చోరీకి గురైంది.
ఆ విగ్రహంతోపాటు శివగామి అమ్మవారు, మానిక్కవసాగర్, శ్రీబలినాయకర్ విగ్రహాలు కూడా అపహరణకు గురయ్యాయి.
