అయోధ్య రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు నిన్న సాయంత్రం ముగించింది. ఈ కేసుకు సంబంధించి వినడానికి ఇంకేమీ లేదంటూ విచారణ ముగింపు సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రస్తుతం తుది తీర్పు మాత్రమే పెండింగ్ లో ఉంది. మరోవైపు, నిన్నటి వాదనల సందర్భంగా కక్షిదారుల్లో ఒకటైన సున్నీ వక్ఫ్ బోర్డు ఓ సంచలన ప్రతిపాదన చేసింది. వివాదాస్పద స్థలంపై తమకున్న హక్కును వదులుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కానీ, అందుకు మూడు షరతులు విధించింది.
ఈ మేరకు వాదనల చివరి రోజున మధ్యవర్తిత్వ కమిటీ ద్వారా తన ప్రతిపాదనను సుప్రీంకోర్టుకు సున్నీ వక్ఫ్ బోర్డు పంపించింది. ఈ ప్రతిపాదనలపై సున్నీ వక్ఫ్ బోర్డుతో పాటు కొన్ని హిందూ పక్షాలు కూడా సంతకం చేసినట్టు తెలుస్తోంది. ఈ సెటిల్మెంట్ ప్రతిపాదనను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించనుంది.
