గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఆదివారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. గ్యారాపత్తి గ్రామంలో మావోలు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సలైట్లు హతమైనట్టు భద్రతాదళాలు తెలిపాయి. మరో ఆరుగురు గాయాలపాలైనట్టు చెప్పారు. నిఘా వర్గాల సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ జరిపినట్టు సమాచారం. మే 1న భద్రతా దళాలపై జరిగిన దాడి వెనక మాస్టర్ మైండ్‌గా భావిస్తున్న నక్సల్ భాస్కర్ కోసం ఈ వేట ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయని సమాచారం. ఎన్‌కౌంటర్‌లో భాస్కర్ గాయపడినట్టు అనుమానిస్తున్నారు. భాస్కర్ కోసం గాలింపు కొనసాగుతోందని భద్రతా వర్గాలు చెబుతున్నాయి.
