బెంగళూరు: మోటారు వాహనాల చట్టం కొత్త నిబంధనలు వచ్చాక జరిమానాల రూపంలో ప్రజల జేబుకు భారీగా చిల్లు పడుతోంది. ఈ క్రమంలో కేంద్రం విధించిన భారీ జరిమానాల బారి నుంచి గుజరాత్ ప్రజలకు ఉపశమనం కలిగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే కోవలోకి భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, గోవా, కర్ణాటక ప్రభుత్వాలు కూడా వచ్చాయి. కేంద్రం ఈ విషయంపై పునరాలోచించకపోతే, తామే జరిమానాలు తగ్గిస్తామని ప్రకటించాయి. ప్రస్తుతం ఉన్న జరిమానాలు ప్రజల మీద భారం పెంచుతున్నాయని అభిప్రాయపడ్డాయి. ఇవేకాకుండా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ, దిల్లీ కూడా ఇదే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే ఈ జరిమానాల అంశాన్ని తిప్పి కొట్టిన విషయం తెలిసిందే.
మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి దివాకర్ రౌత్ ఇదే విషయాన్ని లేవనెత్తారు. కేంద్రం తీసుకున్న ట్రాఫిక్ జరిమానాల విషయంపై పునరాలోచించుకోవాలని, జరిమానాలను తగ్గించాలని అభిప్రాయపడ్డారు. గోవా రవాణా శాఖ మంత్రి మౌవిన్ గోదిహ్వో జరిమానాలను ఇప్పట్లో అమలు పరిచేది లేదని వచ్చే ఏడాది జనవరి నుంచి వీలైతే అమల్లోకి తెస్తామన్నారు. ఇక కన్నడ ప్రభుత్వం కూడా గుజరాత్ బాటలో నడిచింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ట్రాఫిక్ నిబంధనలే కర్ణాటకలోనూ అమలు చేస్తామని ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన ట్రాఫిక్ జరిమానాలను తగ్గిస్తే రాష్ట్రాలే బాధ్యత వహించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పిన విషయం తెలిసిందే. ట్రాఫిక్ నిబంధలను అతిక్రమించే వారికి విధించే జరిమానాలు తగ్గిస్తే ఆ తర్వాత పరిణామాలకు ఆయా రాష్ట్రాలే బాధ్యత తీసుకోవాలన్నారు. జరిమానాలు విధించి డబ్బు రాబట్టడం కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం కాదని, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు.
