వాషింగ్టన్ : జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దుచేశాక కశ్మీర్ లోయలో నెలకొన్న పరిస్థితులపై అమెరికా నేతలు స్పందించారు. కశ్మీర్‌లో కమ్యునికేషన్ పునరుద్దరించాలని కోరారు. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పొంపేకు లేఖ కూడా రాశారు. ఇందుకోసం భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని కూడా కోరారు.
ఇండో అమెరికన్ కాంగ్రెస్ మహిళ నేత ప్రమీల జయపాల్ .. హౌస్ ఆఫ్ రిప్రజెంటివ్‌లో సభ్యులు, కాంగ్రెస్ నేత జేమ్స్ పీ మెక్ గవర్న్ ఇద్దరు సభ్యులు అమెరికా విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాశారు. కశ్మీర్ లోయలో మానవ హక్కులను పునరుద్ధరించాలని కోరారు. గృహ నిర్బంధంలో ఉన్న నేతలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు అంతర్జాతీయ మీడియా, మానవ హక్కుల సంఘాలను కశ్మీర్‌లో పరిస్థితి సమీక్షించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతోపాటు 144 సెక్షన్ వెనక్కి తీసుకోవాలని .. జనజీవనం స్తంభించకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆస్పత్రులు కూడా తెరవాలని .. లేదంటే అనారోగ్యంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గుర్తుచేశారు. ఈ అంశాలపై మానవత్వంతో స్పందించి .. మానవ హక్కులను కశ్మీర్ లోయలో కాపాడాలని కోరారు. అయితే ఇటీవల జర్నలిస్టులు, అడ్వకేట్లను కూడా మోడీ ప్రభుత్వం నిర్బంధించడంతో .. అమెరికా నేతల లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. కశ్మీర్ లోయలో ఇప్పటికీ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మొబైల్ ఫోన్లు మూగబోయాయి.
గత నెల 5వ తేదీన ఆర్టికల్ 370 రద్దుచేసి … జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం రద్దుచేసింది. వెంటనే జమ్ముకశ్మీర్, లడాఖ్‌ను కేంద్రపాంత్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారీగా బలగాలను మొహరించారు. రాజకీయ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. అక్కడ పరిస్థితిని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ స్వయంగా పరిశీలించారు.
