ముంబయి: మహారాష్ట్రలోని పలు ప్రాంతాలు నీటిలో చిక్కుకుపోయాయి. రానున్న రెండు రోజుల్లో కూడా ముంబయి పరిసర ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణశాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తడంతో ముంబయి, థానే, కొంకణ్ ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆశిష్ షేలార్ చెప్పారు. ముందుజాగ్రత్త చర్యగా నగరాల్లోని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం గురువారం సెలవు ప్రకటించిందని మంత్రి ఆశిష్ పేర్కొన్నారు. విద్యార్థులు ఇళ్లలోంచీ బయటకు రావొద్దని మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశించింది. భారీవర్షాల వల్ల రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకొని జలాశయాలను తలపిస్తున్నాయి. దీంతో వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు రావడంతో సాదారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వర్షాలతో రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. కొన్ని విమాన సర్వీసులు రద్దవగాఉ కొన్నింటి రాకపోకలు ఆలస్యమవుతున్నాయి.
