న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో సమాచార సేవలపై విధించిన ఆంక్షలను 15 రోజుల్లోనే పునరుద్ధరిస్తామని ఆ రాష్ట్ర ప్రతినిధులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతినిధులు, గ్రామ పెద్దలను అమిత్ షా మంగళవారం కలిశారు.
ఈ సందర్భంగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు, సర్పంచులకు రూ. 2లక్షల బీమా సౌకర్యం కల్పించనున్నట్లు అమిత్ షా తెలిపారు. కాగా, ఆగస్టు 5న జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన అనంతరం ఆ రాష్ట్రంలో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. 370 రద్దుతోపాటు జమ్మూకాశ్మీర్, లడక్ ప్రాంతాలను విడదీసి కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసిన విషయం తెలిసిందే.
శాంతిభద్రతలను దృష్టి పెట్టుకుని ఆనాటి నుంచి మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. దీంతో తాము తమ కుటుంబసభ్యులు, బంధువులతో మాట్లాడే అవకాశం లేకుండా పోయిందని జమ్మూకాశ్మీర్ ప్రతినిధులు అమిత్ షాకు వివరించారు. దీంతో 15రోజుల్గోగా సమాచార సేవలను పునరుద్ధరిస్తామని అమిత్ వారికి హామీ ఇచ్చారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత సమాచార సేవలను నిలిపేయడం వల్ల అక్కడి ప్రజలకు మంచే జరిగిందని, అనేక ప్రాణాలు నిలబడ్డాయని జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇటీవల వ్యాఖ్యానించారు. జమ్మూకాశ్మీర్ ప్రజల క్షేమమే తమకు ముఖ్యమని, 10 రోజులపాటు టెలిఫోన్ సేవలు లేకపోతే పెద్ద నష్టమేమీ లేదని ఆయన అన్నారు. త్వరలోనే సమాచార సేవలన్నీ ప్రారంభమవుతాయని గవర్నర్ తెలిపారు.
