దిల్లీ: భూపాలపల్లి జిల్లా కాకతీయ గని-2లో బొగ్గు తవ్వకాలపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. బొగ్గు తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలపై సింగరేణి కాలరీస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బొగ్గుకోసం జరిపే పేలుళ్లలో రాళ్లు స్థానిక నివాసాలపై పడుతున్నాయని ఎన్జీటీలో పిటిషనుదారు నాగవేల్లి రాజలింగం న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు విచారణ జరిపిన జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం ప్రజలకు ఇబ్బంది రాకుండా బొగ్గు తవ్వకాలు చేపట్టాలని సింగరేణి కాలరీస్‌కు సూచించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్ర పర్యావరణ శాఖ రెండు రోజుల గడువు కోరడంతో న్యాయస్థానం అనుమతిచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబరు 5కు వాయిదా వేసింది.
