ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ మంత్రి చిదంబరాన్ని అరెస్ట్ చేసిన సీబీఐ.. గురువారం ఆయన్ను సీబీఐ కోర్టు ముందు హాజరు పర్చింది. విచారణలో భాగంగా తాము సంధించే ప్రశ్నలకు చిదంబరం సమాధానాలు ఇవ్వడం లేదని, తమకు సహకరించడం లేదని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఆయన్ను ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని స్పెషల్ జడ్జి అజయ్ కుమార్ కుహార్‌ను సీబీఐ కోరింది. ఈ కేసులో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీబీఐ తరఫున వాదించారు. చిదంబరం తరఫున కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ, వివేక్ టంఖా వాదనలు వినిపించారు.
సీబీఐ కేసు మొత్తం ఇంద్రాణి ముఖర్జియా వాంగ్మూలం ఆధారంగానే ముందుకెళ్తోందని అభిషేక్ సింఘ్వీ విమర్శించారు.దర్యాప్తు సంస్థ ఐదుసార్లు పిలిచినా వెళ్లపోతే దాన్ని సహాయ నిరాకరణగా భావించొచ్చు. కానీ వాళ్లకు నచ్చినట్టుగా బదులివ్వకపోవడం సహాయ నిరాకరణ కాదు. సీబీఐ అధికారులు చిదంబరాన్ని ఓసారి పిలవగా.. ఆయన వెళ్లారు. ఇందులో సహకరించకపోవడం ఎక్కడుంది? అని అభిషేక్ సింఘ్వీ ప్రశ్నించారు.
