యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 25వేల మంది హోంగార్డులను విధుల నుంచి తొలగించింది. అంతేకాదు 99వేల మంది హోంగార్డులకి నెల జీతం బదులు.. రూ.500 రోజువారీ వేతనంగా చెల్లిస్తోంది. దీనికి కారణం బడ్జెట్ లేకపోవడమే. హోంగార్డుల పని దినాలను కూడా తగ్గించింది. నెలకు 25 నుంచి 15 రోజులకి తగ్గించింది. దీంతో హోంగార్డుల ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడినట్లు అయ్యింది. దీపావళికి ముందు ఇలా జరగడంతో.. వేలాది మంది హోంగార్డుల కుటుంబాలు ఆందోళనలో పడిపోయాయి.
ఆగస్టు 28న చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. హోంగార్డుల తొలగింపు నిర్ణయాన్ని ఆ సమావేశంలో తీసుకున్నారు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఖాళీలను భర్తీ చేసేందుకు కొన్నేళ్ల క్రితం విడతల వారీగా 25వేల మంది హోంగార్డులను విధుల్లోకి తీసుకున్నారు. హోంగార్డులను ఎక్కువగా ట్రాఫిక్ విధుల్లో నియమించారు.
గతంలో పోలీస్ కానిస్టేబుళ్లతో సమానంగా హోంగార్డులకు రోజువారీ భత్యాలను చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో రాష్ట్ర బడ్జెట్ పై భారం పెరిగిందని అధికారులు చెప్పారు. హోంగార్డులకు రోజువారీ వేతనంగా రూ. 500 ఇచ్చేవారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రోజువారీ వేతనం రూ. 672కి పెరిగింది. ఇది రాష్ట్ర బడ్జెట్ పై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. హోంగార్డులకు ఎలాంటి ఫిక్స్డ్ శాలరీ ఉండదు. రోజువారీగా వేతనం చెల్లిస్తారు. ఎన్ని రోజులు డ్యూటీ చేస్తే అన్ని రోజులకు మాత్రమే పే చేస్తారు. ఇప్పటివరకు 25 రోజులు పని దినాలు ఉండేవి. ఇప్పుడు వాటిని 15 రోజులకు కుదించింది ప్రభుత్వం.
