జమ్ముకశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు యత్నిస్తున్న ఉగ్రవాదుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. కథువా ప్రాంతంలో తనిఖీలు చేపట్టి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
కథువా జిల్లాలోని మల్హార్ బెల్ట్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో జమ్ముకశ్మీర్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో 38 కేజీలకు పైగా భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనతో సంబంధమున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు చెప్పారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత వాయుసేన దాడులు జరిపి ధ్వంసం చేసిన పాక్‌లోని బాలాకోట్ ఉగ్ర శిబిరం మళ్లీ ప్రారంభమైందని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కథువా ప్రాంతంలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు లభించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
