శ్రీనగర్, బారాముల్లా, అనంత్‌నాగ్, జమ్మూలకు వెళ్లేందుకు కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌కు అనుమతి కూడా మంజూరు చేసింది. అయితే, ఆ ప్రాంతాల్లో ఆజాద్ సభలు, సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదని, బహిరంగ ప్రసంగాలు చేయకూడదని నిర్దేశించింది.
ప్రజలకు ఏ ఇబ్బందులూ లేకుండా స్కూళ్లు, హాస్పిటళ్లు సజావుగా నడిచేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచనలు చేసింది.
అవసరమైతే స్వయంగా తానే జమ్మూకశ్మీర్‌కు వెళ్తానని భారత చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయి అన్నారు.
జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ ఆర్టికల్ 370కి కేంద్రం చేపట్టిన సవరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ పిటిషన్లపై సెప్టెంబర్ ముగిసేలోగా స్పందనను తెలియజేయాలని కేంద్రానికి, జమ్మూకశ్మీర్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది.
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాను విడుదల చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రానికి, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై విచారణను సెప్టెంబర్ 30కి వాయిదా వేసింది.
ఎండీఎంకే నాయకుడు వైగో ఈ పిటిషన్‌ను వేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై 111వ జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఫరూఖ్ అబ్దుల్లా చెన్నై రావాల్సి ఉందని, ఆయన్ను సంప్రదించలేకపోతున్నామని ఆయన కోర్టు ముందు పేర్కొన్నారు.
