ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదిలో ఆదివారం లాంచీ మునిగిపోయింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు, కచ్చులూరు మధ్య రాయల వశిష్ఠ అనే ప్రైవేటు బోటు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో 11 మంది మృతి చెందారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాంతి స్వరూప్ తెలిపారు. 8 మంది మృతదేహాలు లభించాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఆర్ఎఫ్) ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. ”బోటు ప్రమాదానికి గురైనప్పుడు దాదాపు 70 మంది అందులో ప్రయాణిస్తుండవచ్చు. అందులో 12 మంది మృతి చెందారు. వారిలో 8 మంది మృతదేహాలను బయలకు తెచ్చారు. మరో నాలుగు మృతదేహాలను బయటకు తీసుకొస్తున్నారు” అని చెప్పారు.
గల్లంతయిన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, నేవీకి చెందిన గజ ఈతగాళ్లు ముమ్మరంగా గాలిస్తున్నారు.2 హెలికాఫ్టర్లు, 8 బోట్లు , ఆస్కా లైట్లు, ఇతర రెస్క్యూ పరికరాలతో రాత్రంతా గాలింపు చర్యలు కొనసాగిస్తామని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు.సోమవారం ఉత్తరఖాండ్ నుంచి ప్రత్యేక బృందాలు సైడ్ స్కాన్ సోనార్ పరికరాలతో నదిలో గాలింపు చేపడతాయని తెలిపారు.
ప్రమాద సమయంలో లాంచీలో మొత్తం 61 మంది ఉన్నట్లు స్థానికులు చెప్పారు. అందులో 50 మంది పర్యటకులు కాగా 11 మంది బోటు సిబ్బంది. మంటూరుకు చెందిన కొందరు గిరిజనులు చేపలు వేటాడేందుకు వెళ్లినప్పుడు ప్రమాదం జరిగినట్లు గుర్తించి కొందరిని రక్షించారు.
ఇప్పటివరకు 27మంది సురక్షితంగా బయటపడ్డారు. వారిని రంపచోడవరం, రాజమండ్రి ఆసుపత్రులకు తరలించారు.
వరంగల్ నుంచి తాము 14 మంది వచ్చామని.. బోటు పక్కకు ఒరిగి మునిగిపోయిందని.. చేతికి దొరికిన లైఫ్ జాకెట్లతో బయటపడ్డామని.. ఆ సమయంలో పక్క నుంచి వెళ్తున్న మరో లాంచీ తమను కాపాడిందని వరంగల్‌కు చెందిన పర్యటకుడు ప్రభాకర్ చెప్పారు.
తాము మొత్తం 14 మంది రాగా అయిదుగురు ప్రాణాలతో బయటపడ్డామని.. ఇంకా తమ బృందంలోని 9 మంది కనిపించడం లేదని చెప్పారు.
